10వ తరగతి తరువాత

after 10th
after 10th

విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. దాదాపు భవిష్యత్తు మొత్తం ఇక్కడే నిర్ణయమైపోతుంది. రోజురోజుకీ పోటీ తీవ్రమవుతునన్న ప్రస్తుత ప్రపంచంలో ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరితే ఏమవుతుంది? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? ఇలా రకరకాల ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. అరకొర సమాచారంతో… అందరి సలహాలతో… ఆందోళన చెందుతుంటారు.
అందుకే అందుబాటులో ఉన్న అనేక అవకాశాలపై అవగాహన కల్పించి సరైన నిర్ణయం తీసుకోవడానికి సాయపడేందుకు టెన్త్ తర్వాత ఏమేం చేయవచ్చో తెలియజేస్తున్నాం. మీ మీ అవసరాలకు తప్పనిసరిగా ఉపయోగపడతాయని భావిస్తున్నాం. పరిశీలించండి!

కోర్సులు

ఇంటర్మీడియట్

”ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా, ఇంటర్మీడియట్‌తోనే ఆరంగేట్రం చేయాలి. అయితే ఇంటర్లో ఏయే గ్రూపులు ఉంటాయి? ఏ గ్రూపు చదివితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? అసలు గ్రూపులను ఎలా ఎంచుకోవాలి? ఇంటర్ తర్వాత ఏం చేయాలి?”… పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మనసులో మెదిలే ప్రశ్నలివి. ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు, గ్రూపు ఎంపికలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండేందుకు అందిస్తున్న సమాచారమిది.

  • విద్యార్థులు కాస్త తక్కువస్థాయిలోనైనా సాంకేతిక నైపుణ్యం సాధించడానికి ఐటీఐ, దీర్ఘకాలిక సాంకేతిక కోర్సులు చేయాలంటే ఇంటర్ వృత్తి విద్యాకోర్సులు, సాంకేతిక విద్యలో డిప్లొమా కోసం పాలిటెక్నిక్ రంగాలను ఎంచుకుంటారు. అయితే ఉన్నత విద్యలోకి ప్రవేశించేందుకు మాత్రం సాధారణ ఇంటర్మీడియట్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఉన్నత విద్యారంగానికి ఇది ‘గేట్ వే’ లాంటిది. ఉన్నత విద్యకు వారధి లాంటి ఇంటర్మీడియట్‌లో గ్రూపును ఎంచుకోవడమే అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపుమీదే మిగిలిన (ఉన్నత) విద్య అంతా ఆధారపడి ఉంటుంది. విద్యార్థి కెరీర్‌ను నిర్దేశించే కీలకమైన మలుపు కూడా ఈ కోర్సే. పాఠశాలవిద్యకూ, ఉన్నత విద్యకూ మధ్య వారధిలాంటి ఇంటర్లో ఏ గ్రూపులో చేరాలనే విషయమై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తులో జీవిత గమనాన్ని నిర్దేశించే గ్రూపును ఎంచుకోవడంలో తప్పటడుగు ఏ మాత్రం పనికిరాదు. విద్యార్థులు ఇంటర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో ముందే ఒక నిర్ధరణకు రావాలి.
ఇంటర్మీడియట్‌లో చేరేముందు

విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరేముందు సొంతంగా గ్రూపును ఎంచుకునేందుకు కొన్ని పరిమితులున్నాయి. అవి..
* పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలామందికి ఇంటర్లో ఉండే గ్రూపుల గురించి సరైన అవగాహన ఉండదు. ఏ గ్రూపులో ఏయే సబ్జెక్టులు ఉంటాయో, భవిష్యత్తులో వాటికి ఉన్న ఉపాధి అవకాశాలేమిటో చాలామందికి సరిగ్గా తెలియకపోవచ్చు.
* గ్రూపుల గురించి తెలుసుకున్నా, ఏ గ్రూపులో రాణించగలరనే విషయంలో వారికి ఒక స్పష్టత ఉండకపోవచ్చు.
* సొంతంగా నిర్ణయం తీసుకునేంత వయసు, అనుభవం లేకపోవడంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఇచ్చే సలహాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
* ఇలా అయోమయ పరిస్థితుల్లో ఏదో ఒక గ్రూపును ఎంచుకుంటే తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నింటికీ మించి విలువైన కాలం వృథా అవుతుంది.
ఈ పరిమితులను అధిగమించి, సరైన నిర్ణయం తీసుకోవాలంటే, విద్యార్థి ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ముందే కొంత పరిజ్ఞానం సంపాదించాలి. అంతకంటే ముందు తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి అభిరుచి, సామర్థ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి.

పోటీ పరీక్షలకు కొత్తరూపు: కేంద్ర ప్రభుత్వం ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షలను నిర్వహించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎంసెట్ తదితర పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. మెడికల్‌కు ‘నీట్, ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ‘ఐసీట్’ లను నిర్వహించే సన్నాహాలు మొదలయ్యాయి. రూపు మారనున్న పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులు గ్రూపులను ఎంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

గ్రూపులు కాంబినేషన్లు

ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఏడెనిమిది కాంబినేషన్లలో మాత్రమే చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కాలేజీలూ వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి.
కొన్ని ప్రధానమైన గ్రూపులు
* ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
* బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
* సీఈసీ (కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్)
* ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్)
* హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్)
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కాంబినేషన్ గ్రూపులు చాలా తక్కువ కళాశాలల్లోనే ఉన్నాయి. ఉదాహరణకు మ్యూజిక్ సబ్జెక్టు విశాఖపట్నంలో మాత్రమే ఉంది. ఈ తరహా కాంబినేషన్లు కొన్ని..

* హిస్టరీ, ఎకనమిక్స్, కామర్స్
* హిస్టరీ, సివిక్స్, సోషియాలజీ
* హిస్టరీ, ఎకనమిక్స్, మ్యూజిక్
* హిస్టరీ, ఎకనమిక్స్, సైకాలజీ
* హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ
* ఎకనమిక్స్, సివిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
బోర్డు అందిస్తున్న గ్రూపుల్లో పైన పేర్కొన్న పదకొండు గ్రూపుల్లోనే విద్యార్థులు చేరుతున్నారు. వీటిలో ఏ గ్రూపు ఎంచుకోవాలో నిర్ణయించుకునే ముందు విద్యార్థి వివిధ కోణాల్లో ఆలోచించాలి. ముందుగా ‘తన అభిరుచి ఏమిటి? లక్ష్యం ఏమిటి? అది సాధించేందుకు ఇప్పటి నుంచి ఏం చేయాలి తదితర ప్రశ్నలకు విద్యార్థి సంతృప్తికరమైన సమాధానాలను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత తన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న గ్రూపును ఎంచుకోవాలి.

ఎంపీసీ

ప్రధానంగా ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు; సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.

జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి పరీక్ష (జేఈఈ – మెయిన్) రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. బిట్స్‌పిలానీల్లో ప్రవేశానికి జరిగే ‘బిట్‌శాట్’ రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు.
ఎంసెట్: ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థికి నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో సీటు వస్తుంది. సుమారు 27 ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో ప్రవేశానికి ఎంసెట్ పునాదిలాంటిది.
బి.ఎస్‌సి.: ఇంటర్మీడియట్ తర్వాత బి.ఎస్‌సి.లో చేరాలనుకుంటే మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్…. ఇలా వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.

బీపీసీ

డాక్టర్‌గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉన్నత విద్యావకాశాలకూ కొదవ లేదు.

బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదే.
వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.

ఎంఈసీ, సీఈసీ

సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ; కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు; ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు.

గణనీయంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం ప్రధానపాత్ర పోషిస్తోంది. దీంతో కామర్స్ విద్యార్థులకు ఎంతో గిరాకీ పెరిగింది. మ్యాథమేటిక్స్, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. ఈ రంగాలపై గత అయిదారేళ్లుగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఆర్ట్స్ గ్రూపులు

పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది. అయితే, ఇంజినీరింగ్ కోర్సులు చేసినవారిలో ఎక్కువమంది ఉపాధికి చేరువ కాకపోవడం, ఐటీ రంగానికి కష్టకాలం రావడం లాంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపులపై మొగ్గు చూపడం ప్రారంభమైంది. కార్పొరేట్ జూనియర్ కళాశాలలూ యూపీఎస్‌సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తూ ఉండటం మొదలైంది.

దీంతో ఆర్ట్స్ గ్రూపులకు మళ్లీ ఆదరణ పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్ట్స్ గ్రూపుల విషయంలో చరిత్ర పునరావృతమవుతోందా? అనే సందేహం కలుగుతుంది. యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.

వృత్తివిద్య(ఇంటర్మీడియట్)

ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీడియట్ వారధిలాంటిదైతే, ఉపాధికి ఇంటర్మీడియట్ వృత్తి విద్యాకోర్సులు నిచ్చెనల్లాంటివి. పదోతరగతి తర్వాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలను, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునే వారు సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపుల్లో చేరతారు.

రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులకు మరింత ప్రయోజనాన్ని కల్పించే దిశగా అధికారులు కొత్త రూపునిచ్చారు.ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇప్పటివరకూ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలే లేని ఈ కోర్సులకు తొలిసారిగా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు. రాష్ట్రంలో వృత్తి విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
29 కోర్సుల్లో శిక్షణ:
రాష్ట్రంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తి విద్యాసంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ – ఎస్.ఐ.వి.ఇ.) వృత్తి విద్యా కోర్సులను అందిస్తోంది. రాష్ట్రంలో 820 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 372 ప్రభుత్వ, 85 ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్ల వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 12 ఎక్స్‌క్లూజివ్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 766 ప్రైవేటు జూనియర్ కళాశాలలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, వ్యవసాయ-వ్యవసాయాధారిత, హోంసైన్స్ తదితర రంగాల నుంచి మొత్తం 29 రకాల కోర్సులను గుర్తించి వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

ఎంసెట్ / బిఎస్సి

వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
* రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారు ఎంసెట్‌కు కూడా హాజరు కావచ్చు. దీని కోసం నిర్దేశించిన బ్రిడ్జికోర్సు పూర్తి చేయాలి.
* ఒకవేళ డిగ్రీ చదవాలనుకుంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులతో సమానంగా ఆర్ట్స్, కామర్స్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా బీఎస్సీలోనూ చేరవచ్చు.
* ప్రైవేటు కళాశాలలో వృత్తి విద్యా కోర్సు చేసే ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం బోధనారుసుం కింద రూ.4,500 చెల్లిస్తోంది.
* సాధారణ ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు వృత్తి విద్యా కోర్సు చేసేవారికీ ఉపకారవేతనాలు అందుతాయి. ‘ప్రతిభ అవార్డులకూ వీళ్లు అర్హులే.
* వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చు. ఇందుకు ఎలాంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా కూడా పాలిటెక్నిక్ చేయవచ్చు. అప్పుడు కూడా రెండో సంవత్సరం నుంచే చదవవచ్చు.

* దీర్ఘకాలిక కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సమయంలో విద్యార్థికి ప్రతినెలా స్టయిపెండ్ కింద కొంత నగదు లభిస్తుంది (కొన్ని కంపెనీలు మార్కెట్ డిమాండ్‌ను బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకూ చెల్లిస్తున్నాయి).

చేరడమెలా?

టెన్త్ ఫలితాలు వెలువడిన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు దీర్ఘ కాలిక (రెండేళ్ల) వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తుంది. విద్యార్థులు నేరుగా జూనియర్ కళాశాలలను సంప్రదించవచ్చు. ప్రవేశాల ప్రక్రియ జులై 15 వరకూ కొనసాగుతుంది. ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం రూ.800 ఫీజు చెల్లించాలి. రెండో సంవత్సరం రూ.590 చెల్లించాల్సి ఉంటుంది.

‘మేళా’ల్లో వేలాది మందికి ఉపాధి:
ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏటా జాబ్ మేళాలు, అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ వేలాది మందికి వీటి ద్వారా ప్రయోజనం చేకూరింది. వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థికి కనీసం రూ.6000 నుంచి రూ.10,000 వేతనంతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు కొనసాగుతున్నాయి.

మౌలిక వసతుల కల్పన

వృత్తివిద్యాకోర్సులు విజయవంతం కావాలంటే మౌలికవసతులు, అధ్యాపకులు, శిక్షణ పద్ధతులు నాణ్యమైనవిగా ఉండాలి. ఈ మూడు అంశాలపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరింత దృష్టి సారించింది. లేబొరేటరీల ఆధునికీకరణకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పెద్ద పీట వేస్తోంది. ప్రాక్టికల్స్ నిర్వహణ పటిష్టంగా ఉండేందుకు సమీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉపాధి – ఉన్నత విద్య – ఉపాధితోపాటు ఉన్నతవిద్య… ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలనుకున్నా అందుకు చక్కగా సరిపోయేవి ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులు. ప్రభుత్వం ఈ ప్రయోజనాలన్నిటినీ క్రోడీకరించి రూపొందించిన కోర్సులివి. టెన్త్ తర్వాత రెండేళ్లు వృత్తి విద్యకు కేటాయించడం ద్వారా త్వరగా ఉపాధి సంపాదించుకోవచ్చు. పాక్షికంగా ఉపాధి పొందుతూ ఉన్నత విద్యాభ్యాసం చేయవచ్చు. టెన్త్ తర్వాత రెండేళ్లకే ఒక సాంకేతిక విద్యానిపుణుడిగా తయారయ్యే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ కోర్సుల్లో చేరితే పెరుగుతున్న సాంకేతిక అవసరాలను ఉపాధికి అనుకూలంగా మలచుకునే అవకాశముంది.

అనంతరం ఉండే ఉపాధి అవకాశాలు

* బిజినెస్: షాపింగ్‌మాల్ సూపర్‌వైజర్, మార్కెటింగ్, రిసెర్చ్ అసిస్టెంట్, సేల్స్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్అసిస్టెంట్, జూనియర్అకౌంటెంట్.
* హెల్త్ అండ్ పారా మెడికల్: ఎ.ఎన్.ఎం.; ల్యాబ్ అసిస్టెంట్, సబ్ అసిస్టెంట్; డెంటల్ టెక్నీషియన్; డెంటల్ హైజీనిస్ట్; ఆప్తాల్మిక్ టెక్నీషియన్.
* హోంసైన్స్: గ్రామ సేవకులు, టైలరింగ్, ఇన్‌స్ట్రక్టర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, శారీ డిజైనర్, బాల్వాడీలు, అంగన్‌వాడీ టీచర్లు, క్రెష్ అసిస్టెంట్లు, ప్రీస్కూల్ టీచర్లు, క్యాటరింగ్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, స్టివార్డ్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ అసిస్టెంట్.
* ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ: మెకానిక్స్ గ్రేడ్-1, మెకానిక్స్ గ్రేడ్-3, ఫిట్టర్ గ్రేడ్-1, టూవీలర్ మెకానిక్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్; వర్క్ ఇన్‌స్పెక్టర్, సివిల్ వర్క్ అసిస్టెంట్; స్కిల్డ్ క్లాస్-2, ట్రేడ్‌మెన్ గ్రేడ్-1, సివరేజ్ అండ్ శానిటరీ అసిస్టెంట్, సివిల్ సూపర్‌వైజర్, వర్క్ ఇన్‌స్పెక్టర్; రేడియో/టీవీ/ ఎలక్ట్రానిక్ మెకానిక్; ఎలక్ట్రీషియన్, జూనియర్ లైన్‌మేన్, డొమెస్టిక్ వైర్‌మేన్, డొమెస్టిక్ అప్లయెన్సెస్ మెకానిక్; జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ రిసెప్షనిస్ట్, బిల్లింగ్ క్లర్క్స్ (ఇ-సేవ కేంద్రాల్లో), వెబ్‌డిజైనర్.
* అగ్రికల్చర్: విలేజ్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్, సబ్ అసిస్టెంట్ ఇన్ అగ్రికల్చర్, వీడీఓలు; డెయిరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్; ఫిషరీస్ అసిస్టెంట్, ప్రాన్స్ కల్చర్, ఆక్వా కల్చర్; సెరికల్చర్ అసిస్టెంట్, ఫోర్‌మేన్ ఇన్ సెరికల్చర్.
* హ్యుమానిటీస్: టూరిస్ట్ గైడ్, టూరిజం అసిస్టెంట్, ట్రావెల్ ఖీ టికెటింగ్ ఏజెంట్స్, టూర్ ఆర్గనైజర్స్.

రెండేళ్ళ వొకేషనల్ కోర్సులు

* అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్‌ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.
* బిజినెస్ అండ్ కామర్స్ : మార్కెటింగ్ అండ్ సేల్స్‌మేన్‌షిప్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, అకౌంట్స్ అండ్ టాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్.
* హ్యుమానిటీస్ అండ్ అదర్స్ : టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్.
* ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, రూరల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, వాటర్‌సప్త్లె అండ్ శానిటరీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ.
* హెల్త్ అండ్ పారామెడికల్: మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎం.ఎల్.టి.), మల్టిపర్పస్ హెల్త్ వర్కర్ (ఫీమేల్), ఫిజియోథెరపీ, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్.
* హోంసైన్స్ : కమర్షియల్ గార్మెంట్ అండ్ డిజైన్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్, హోటల్ ఆపరేషన్.

పాలిటెక్నిక్

పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయి? తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
పదోతరగతి పూర్తయ్యాక మూడేళ్లకే ఇంజినీరింగ్ డిప్లొమా పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అత్యంత అనువైనవి. ఇవి డబ్బు, సమయం వృథా కాకుండా సాంకేతిక విద్యార్హత సాధించడానికి ఉపకరిస్తాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తోంది పాలిటెక్నిక్. పదోతరగతి పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా అంత స్థోమత లేనివాళ్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పదోతరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లొమా పొందడానికి పాలిటెక్నిక్‌ను ఎంచుకుంటారు. మరోవైపు పారిశ్రామిక రంగం ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో దీటుగా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులకూ ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని రకాల నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తే, పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు ఇవ్వగలమంటూ ప్రభుత్వానికి హామీ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది. ఫలితంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయి. గ్రామీణ, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చక్కటి అవగాహనతో పని చేయడం, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి రావడం లాంటి కారణాలతో పారిశ్రామిక రంగం పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు పెంచింది. డిప్లొమా కోర్సుల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన కలిగించేలా రూపొందించిన కోర్సులు కూడా కంపెనీలను ఆకట్టుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటి వల్ల ఈ కోర్సులకు ఎల్లవేళలా ఆదరణ ఉంటోంది. సివిల్, మెకానికల్ లాంటి ప్రాథమిక తరహా కోర్సులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చేసిన వారితో పోలిస్తే, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉపాధి అవకాశాలూ ఎక్కువే.

కోర్సులు

* మూడేళ్ల కోర్సులు
సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.
* మూడున్నరేళ్ల కోర్సులు
మెటలర్జికల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ.
* ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు
ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్.
రాష్ట్రవ్యాప్తంగా 248 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 70620 సీట్లున్నాయి. వీటికోసం ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది పోటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

డిప్లొమా చేసిన తరువాత అవకాశాలు

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ఉద్యోగం, ఉన్నత విద్య.
ఉద్యోగం:
ఇందులోనూ రెండు మార్గాలున్నాయి. ఒకటి స్వయం ఉపాధి; రెండోది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగం పొందడం. ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి.
బ్రాంచిల ఆధారంగా ఉద్యోగావకాశాలున్న రంగాలు: ఇంజినీరింగ్ డిప్లొమా (పాలిటెక్నిక్) కోర్సుల్లో వేటికి ఏ రంగంలో ఉద్యోగావకాశాలు ఉంటాయో పేర్కొంటూ సాంకేతిక విద్యాశాఖ అధికారులు రూపొందించిన జాబితా కింది విధంగా ఉంది.
1. సివిల్ ఇంజినీరింగ్: నీటిపారుదల, పబ్లిక్ హెల్త్, రోడ్లు, భవనాలు, రైల్వే, సర్వే, డ్రాయింగ్, నీటిసరఫరా, తదితర ప్రభుత్వ/ ప్రైవేటు రంగాలు.
2. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్: డిజైన్, డ్రాయింగ్ శాఖలు, మునిసిపాలిటీల్లో లైసెన్స్ డిజైనర్, డ్రాఫ్ట్స్‌మెన్.
3. మెకానికల్ ఇంజినీరింగ్: మెషినరీ, ట్రాన్స్‌పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్లలో వర్క్‌షాపులు, గ్యారేజీల్లో అవకాశాలు.
4. ఆటోమొబైల్ ఇంజినీరింగ్: ఏపీఎస్ఆర్టీసీ, రవాణా రంగం, ఆటోమొబైల్ షోరూమ్‌లు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ.
5. ప్యాకేజింగ్ టెక్నాలజీ: ఫార్మాస్యూటికల్, ఫుడ్, బెవరేజ్, పేపర్, ప్లాస్టిక్ తదితర రంగాల్లో ప్యాకేజింగ్ విభాగాల్లో అవకాశాలు.
6. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో, డీసీఎల్ లాంటి సంస్థల్లో ఉపాధి.
7. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో అవకాశాలు.
8. అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్: ప్రాసెస్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో.
9. కంప్యూటర్ ఇంజినీరింగ్: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రెయినింగ్ తదితర రంగాల్లో.
10. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: అన్ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీల్లో.
11. మైనింగ్ ఇంజినీరింగ్: గనులు, ఎస్.సి.సి.ఎల్., ఎన్.ఎం.డి.సి., తదితర సంస్థల్లో.
12. కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ): పేపర్, సుగర్, పెట్రో కెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో.
13. ప్రింటింగ్ టెక్నాలజీ: కంపోజింగ్ డీటీపీ, ఫిల్మ్ మేకింగ్, ప్రింటింగ్ రంగాల్లో.
14. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్టెనో, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్; రీటైల్ వ్యాపార రంగంలో అవకాశాలు.
(1 నుంచి 14 కోర్సులకు కాలవ్యవధి మూడేళ్లు.)
15. ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు
ఎంబెడెడ్ సిస్టమ్స్: ఎలక్ట్రానిక్ ఐసీ సర్క్యూట్ల తయారీ రంగం.
కంప్యూటర్ ఇంజినీరింగ్: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ శిక్షణ సంస్థల్లో.
కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ప్రాసెస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు.
ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్ ఐసీ సర్క్యూట్స్ తయారీ రంగం, ప్రాసెస్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు.
టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, ప్రైవేటు టీవీ ఛానెళ్లు, ప్రభుత్వ-కార్పొరేట్ హాస్పిటళ్లలో.
బయోమెడికల్ ఇంజినీరింగ్: మెడికల్ రిసెర్చ్ సంస్థలు, హాస్పిటళ్లు.
16. మెటలర్జికల్ ఇంజినీరింగ్: ఫౌండ్రీలు, స్టీల్ ప్లాంట్స్, ఫోర్జ్ షాప్స్, రోలింగ్ మిల్లులు, హీట్ ట్రీట్‌మెంట్ షాప్స్,
డిఫెన్స్ సంస్థల్లో…
17. టెక్స్‌టైల్ టెక్నాలజీ: టెక్స్‌టైల్ మిల్లులు, వస్త్రాల ఎగుమతి పరిశ్రమల్లో.
18. కెమికల్ ఇంజినీరింగ్: కెమికల్, రిఫైనరీ, పెట్రోకెమికల్ పరిశ్రమలు.
19. కెమికల్ ఇంజినీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ): రిఫైనరీ, పేపర్, సుగర్, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు.
20. కెమికల్ ఇంజినీరింగ్ (పెట్రో కెమికల్): రిఫైనరీ, పెట్రో కెమికల్, కెమికల్ పరిశ్రమలు.
21. కెమికల్ ఇంజినీరింగ్ (ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్): కెమికల్ పాలిమర్, ప్లాస్టిక్ పరిశ్రమలు.
22. సిరామిక్ టెక్నాలజీ: రిఫ్రాక్టరీ, ఇటుకబట్టీలు, సిమెంట్, గ్లాస్, సిరామిక్, శానిటరీ వేర్ తదితర రంగాలు.
23. లెదర్ టెక్నాలజీ: ట్యానరీ, ఫుట్‌వేర్ పరిశ్రమలు.
24. ఫుట్‌వేర్ టెక్నాలజీ (లెదర్): ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లెదర్ టెక్నాలజీ.
(15 – 24 వరకు ఉన్న కోర్సులకు కాలవ్యవధి మూడేళ్లు.)

ఉన్నత విద్యావకాశాలు

పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ, రెగ్యులర్ కోర్సులు చేయవచ్చు. తద్వారా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే ఉన్నత సాంకేతిక విద్యావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
* ఈసెట్ (ఎఫ్.డి.హెచ్.): ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -ఫర్ డిప్లొమా హోల్డర్స్ (ఈసెట్-ఎఫ్‌డీహెచ్)గా వ్యవహరించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఇంజినీరింగ్ చేయవచ్చు. కాల వ్యవధి మూడేళ్లు. లేటరల్ ఎంట్రీ అని పిలిచే ఈ విధానంలో నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరవచ్చు. అయితే ఈ విధానం ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోనే ఉంది. యూనివర్సిటీల అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి చదవాల్సిందే. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 10 శాతం సీట్లను ఈసెట్ (ఎఫ్‌డీహెచ్)కు కేటాయించారు.
* పాలిటెక్నిక్ చదివినవారు ఎంసెట్ రాయడానికీ అర్హులే. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా తమకు ఆసక్తి ఉన్న బ్రాంచీల్లో చేరవచ్చు.
* జేఈఈ(మెయిన్) రాసి, ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్ లేదా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేయవచ్చు.
* పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఇంజినీరింగ్ చేసేందుకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలున్నాయి. రెగ్యులర్ కోర్సుల ద్వారా లేదా ఉద్యోగం చేస్తూ కరస్పాండెన్స్-కమ్-కాంట్రాక్టు కోర్సుల ద్వారా చదువుకోవచ్చు.
‘ఎస్‌డీసీ’ శిక్షణ: ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ చదివి, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులతో పోలిస్తే పాలిటెక్నిక్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీలో చేరిన విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు తక్కువే అనేది పారిశ్రామిక వర్గాలు తరచూ వెల్లడించే అభిప్రాయం. అందుకే పాలిటెక్నిక్ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, ఆంగ్లభాషణ లాంటి అంశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను చేపట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో పోలిస్తే, టెక్నికల్ సబ్జెక్టుల్లో దీటుగా ఉన్నా, సాఫ్ట్ స్కిల్స్ లాంటి కొన్ని నైపుణ్యాల్లో వెనుకబడి ఉంటారు. ఈ లోపాన్ని సవరించడానికి పాలిటెక్నిక్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను (ఎస్‌డీసీ) ఏర్పాటుచేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నందువల్ల వారికి సాఫ్ట్‌స్కిల్స్, ఇతర అవసరమైన అంశాల్లో శిక్షణనిచ్చి పారిశ్రామిక వర్గాల అంచనాలకు అనుగుణంగా తయారుచేయడమే ఈ కేంద్రాల లక్ష్యం. ఇప్పటివరకూ ఈ కేంద్రాల్లో 3400 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.

ఏపీఆర్‌జేసీ

విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను అత్యంత ప్రశాంత వాతావరణంలో అందించాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు 1972లో ఏర్పాటయ్యాయి. పట్టణాలు, నగరాలకు దూరంగా, విద్యకు ఎటువంటి ప్రతిబంధకాలూ లేని ప్రాంతాల్లో ప్రత్యేక సదుపాయాలను కల్పించి, విద్యార్థుల ఏకాగ్రతను పెంచే దిశగా ఇవి పనిచేస్తున్నాయి. సత్ఫలితాలను సాధిస్తున్నాయి. దీంతో గురుకుల విద్యాలయాల పట్ల ఆదరణ పెరిగింది.

  1. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపిక ప్రవేశపరీక్ష ద్వారా ఉంటుంది. ఈ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సొసైటీ ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలను కల్పిస్తోంది. ఎక్కడా రాజీపడకుండా నాణ్యమైన విద్యను అందిస్తోంది. దీంతో గత రెండేళ్లుగా వరుసగా 84 శాతం ఉత్తీర్ణతను ఈ కళాశాలలు సొంతం చేసుకున్నాయి. కొన్ని కళాశాలలు వందశాతం ఉత్తీర్ణతనూ సాధిస్తున్నాయి. పేద విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్నాయి .
    ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎ.పి.ఆర్.ఇ.ఐ. సొసైటీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొమ్మిది సాధారణ జూనియర్ కళాశాలలను, అయిదు ముస్లిం మైనారిటీ జూనియర్ కళాశాలలనూ నిర్వహిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, అనంత‌పురం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ కళాశాలలు ఉన్నాయి. వీటిని కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రీజియన్లుగా విభజించారు.
రీజియన్ల

కోస్తా ఆంధ్ర ప్రాంతం (9 జిల్లాల‌కు)
* తాటిపూడి, విజ‌య‌న‌గ‌రం (బాలికలు)
* నిమ్మకూరు, కృష్ణా జిల్లా(కో ఎడ్యుకేషన్)
* నాగార్జునసాగర్, గుంటూరు (బాలురు)
* వెంకటగిరి, నెల్లూరు
రాయలసీమ ప్రాంతం (4 జిల్లాల‌కు)
* గ్యారంపల్లి, చిత్తూరు
* కొడిగినహళ్లి (బాలురు), అనంత‌పురం
* బనవాసి (బాలికలు), క‌ర్నూలు
* నిమ్మకూరు, కృష్ణా జిల్లా (ఈఈటీ, సీజీడీఎమ్ గ్రూపుల‌కు ఒక్కోదానికి ఏడు సీట్లను రాయ‌ల‌సీమ అభ్యర్థుల‌కు కేటాయించారు)
తెలంగాణ ప్రాంతం (10 జిల్లాల‌కు)
* సర్వేలు (బాలురు), న‌ల్గొండ
* హసన్‌పర్తి (బాలికలు), వ‌రంగ‌ల్‌
* నాగార్జునసాగర్, గుంటూరు (బాలురు)
* నిమ్మకూరు, కృష్ణా జిల్లా (ఈఈటీ, సీజీడీఎమ్ గ్రూపుల‌కు ఒక్కోదానికి ప‌ద‌కొండు సీట్లను తెలంగాణ‌ అభ్యర్థుల‌కు కేటాయించారు)
ముస్లిం మైనారిటీ కళాశాలలు:
* లాలాపేట (గుంటూరు),
* కల్లూరు ఎస్టేట్ (కర్నూలు),
* నగరం (నిజామాబాద్),
* నాగోల్ (ఎల్‌బీనగర్ – హైదరాబాద్)

సదుపాయాలు
  • రెండేళ్లపాటు ఉచిత విద్య
  • ఇంటిగ్రేటెడ్ ఎంసెట్ కోచింగ్
  • ఇంటెన్సివ్ టెస్టింగ్ ప్రోగ్రాం
  • ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ (ఈఈటీ – ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సీజీడీఎం – కమర్షియల్ గార్మెంట్ డిజైన్ మేకింగ్)
  • ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయ‌ల వరకూ నగదు బహుమతులు.

ముస్లిం మైనారిటీ కళాశాలలు: ఉర్దూ మీడియం కళాశాలలకు ముస్లిం మైనారిటీ కళాశాలలుగా పేరు మార్చారు. ఈ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం కోర్సుల‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఈ కళాశాలల్లో సెకెండ్ లాంగ్వేజ్‌గా ఉర్దూ ఉండేది. ఈ సారి ఇతర భాషలనూ చేర్చారు. ఆయా ప్రాంతాల అభ్యర్థుల ప్రాధాన్యం ఆధారంగా అయిదు (ఉర్దూ, తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్) భాషల్లో ఏ మూడింటినైనా కళాశాల ప్రిన్సిపల్ ఎంపిక చేసుకోవచ్చు. ఆ మూడింటిలో ఒకటి విద్యార్థి ఎంచుకోవలసి ఉంటుంది.
లోకో పేరెంట్: రాష్ట్రంలోని మిగతా విద్యాలయాలతో పోలిస్తే గురుకులాల్లో విద్యాభ్యాసం భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ‘లోకో పేరెంట్’ విధానం ఒకటి. తరగతిలోని ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు చొప్పున బాధ్యత వహిస్తారు. ఆయా విద్యార్థుల గురించి అన్ని విషయాలనూ శ్రద్ధగా పరిశీలించి, పరిష్కరిస్తారు. వారు ఆసక్తిగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు.

గురుకుల విధానం

గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల దినచర్య ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనుభవజ్ఞులైన ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో యోగా, మాస్ డ్రిల్, తదితర వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో శారీరక ధారుఢ్యం, ఏకాగ్రత, మానసిక సామర్థ్యం పెంపొందించడానికి కృషిచేస్తారు. తర్వాత ప్రతిభ, నైపుణ్యం, అనుభవం, అంకితభావం గల అధ్యాపకుల ద్వారా తరగతుల్లో బోధన ఉంటుంది.
ప్రతి అధ్యాపకుడు 20 మంది విద్యార్థులకు ‘లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తూ, ఇటు అధ్యాపకుని పాత్ర అటు తల్లిదండ్రుల పాత్రను పోషిస్తారు. ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు రాకుండా ఆరోగ్యానికి, విద్యావ్యాసంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
పరీక్షా విధానం: కోర్సుల్లో ఏటా నాలుగు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు సంస్థలోని అన్ని జూనియర్ కళాశాలలకు ఒకే విధంగా Intensive Testing Programme (ITP) ఉంటుంది. అందులో భాగంగా రెండు పార్ట్ టెస్టులు, రెండు గ్రాండ్ టెస్ట్‌లను పబ్లిక్ పరీక్షల పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు లోకో పేరెంట్స్ తెలియజేస్తారు. సెంట్రల్ మార్క్ రిజిస్టర్ ఆధారంగా ప్రధానాచార్యులు, సహాయ ప్రధానాచార్యులు, సంబంధిత అధ్యాపకులు విద్యార్థుల స్థాయిని తెలుసుకుంటూ, అవసరమనుకున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఎంసెట్ శిక్షణ: అన్ని జూనియర్ కళాశాలల్లోని MPC, BiPC విద్యార్థులకు EAMCET కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఉచితంగా ఎంసెట్ స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు. పేద విద్యార్థులు నితిలీదినిగి లో మంచి ర్యాంకులు సాధించి ప్రయోజనం పొందడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతిలో MEC, CEC విద్యార్థులకు CPT మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు.
గ్రంథాలయాలు: ప్రతి జూనియర్ కళాశాలలో మంచి గ్రంథాలయాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాలతోపాటు జనరల్ స్టడీస్, రిఫరెన్స్ పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు వీటిలో ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వెలువడే ముఖ్యమైన దిన, వార, పక్ష, మాస పత్రికలు కూడా అందుబాటులో ఉంటాయి.
వ్యాయామ విద్య: రోజువారీ వ్యాయామ విద్యతోపాటు విద్యార్థుల ఆసక్తిననుసరించి ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణనిచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ప్రోత్సహిస్తారు. ఈ పోటీల్లో రాణించిన విద్యార్థులకు లభించే సర్టిఫికెట్లు భవిష్యత్తు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ఉపయోగపడతాయి.
* కొన్ని కళాశాలల్లో ఇద్దరు అధ్యాపకుల ఆధ్వర్యంలో NCC, NSS విభాగాలు పనిచేస్తున్నాయి. NCC-B సర్టిఫికెట్, NSSలో ఇచ్చే స్పెషల్ క్యాంపు సర్టిఫికెట్‌లు విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడంతోపాటు మంచి కెరియర్‌కు తోడ్పడతాయి.
* చదువుతోపాటు విద్యార్థుల క్రమశిక్షణకు గురుకుల కళాశాలల్లో ప్రాధాన్యం ఇస్తారు. గాంధేయ విధానాన్ని అనుసరించి విద్యార్థులు వారి పనులను వారే చేసుకుంటారు. శుభ్రత, భోజనం, మెస్‌ల నిర్వహణలో విద్యార్థులు పాల్గొని బాధ్యత, విధులు, కార్యనిర్వహణ పట్ల అవగాహన పెంపొందించుకునే వీలుంటుంది.
* కళాశాలలన్నీ గ్రామీణ వాతావరణంలో ఉంటాయి. అందువల్ల విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటి రక్షణ బాధ్యతను వారికే అప్పగించడం ద్వారా కళాశాలల్లో ఆహ్లాదకర వాతావరణంలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
* ఏటా ఒకసారి విజ్ఞాన, విహార యాత్రకు విద్యార్థులను అధ్యాపకులు తీసుకెళ్తారు. తద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం, మనోవికాసం పెంపొందడానికి అవకాశం ఉంటుంది.

ఐటీఐ

ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)ని ఎంచుకోవడం ద్వారా విద్యార్థి పదోతరగతి తర్వాత ఒకటి, రెండేళ్ల కాలవ్యవధిలో సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అదీ అతి తక్కువ వ్యయంతోనే. దీనివల్ల చిన్న వయసులోనే ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే సాంకేతిక విద్యారంగంలోనే ఉన్నత స్థాయి కోర్సులూ చేయవచ్చు. టెన్త్ తర్వాత ఒకటి రెండేళ్ల పాటు కష్టపడి ఐటీఐ కోర్సులు చేస్తే, మంచి ఉపాధి అవకాశాలు ముంగిట్లో ఉంటాయి. ఏ కోర్సు చేయాలో తెలివిగా ఎంచుకోవడమే విద్యార్థుల వంతు.

కేంద్రప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఐటీఐలను ప్రారంభించింది. నిరుద్యోగితను తగ్గించడం, మానవ వనరుల నైపుణ్యాలను పెంచి పరిశ్రమకు అందించడం దీని లక్ష్యాలు. క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీం (సీటీఎస్) కింద 1950లో ఐటీఐలను స్థాపించింది. 14-40 ఏళ్ల మధ్య వయస్కులు ఐటీఐల్లో శిక్షణ పొందడానికి అర్హులు. ఎక్కువ భాగం ట్రేడ్లలో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థికి కేంద్ర ప్రభుత్వ శ్రామిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్ (ఎన్.సి.వి.టి.) సర్టిఫికెట్ అందిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉపాధి కల్పనలో ఈ సర్టిఫికెట్ ఉన్న విద్యార్థులకే ప్రాధాన్యమిస్తాయి. సాంకేతిక నైపుణ్యాన్ని సాధించాలనుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఐటీఐలవైపే మొగ్గు చూపుతారు. ప్రస్తుతం ఆధునిక పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. దీంతో బహుముఖ నైపుణ్యాలను పెంచుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది. ఏడాది, రెండేళ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సులు (ట్రేడ్లు) పూర్తి చేస్తే స్వయం ఉపాధికి ఢోకా ఉండదు. కొన్ని రకాల కోర్సులకు వందశాతం ఉపాధి అవకాశాలు ఉండగా, మరి కొన్ని కోర్సుల వల్ల వచ్చే ఉద్యోగాలకు సీజనల్‌గా గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో 138 ఐటీఐలు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి), 600 పైగా ఐటీసీలు (ప్రైవేటు రంగంలోనివి) ఉన్నాయి.

ట్రేడ్ ల వివరాలు

ఐటీఐల్లో ఇంజినీరింగ్ కోర్సులు (ట్రేడ్లు) రెండేళ్లు, ఏడాది; నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్లు ఏడాది, ఆరునెలల కాలపరిమితితో ఉన్నాయి. వాటి వివరాలు..
ఇంజినీరింగ్ (రెండేళ్ల కాలవ్యవధి): అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్), డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టం, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టం మెయిన్‌టెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్),

రేడియో-టీవీ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెయిన్‌టెనెన్స్ మెకానిక్ మిషన్ టూల్, మెరైన్ ఫిట్టర్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, వెజల్ నావిగేటర్, వైర్‌మన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్), మెకానిక్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్.
ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు: పెయింటర్ (జనరల్), మెకానిక్ (డీజిల్), మౌల్డర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, శానిటరీ హార్డ్‌వేర్ ఫిట్టర్, సైంటిఫిక్ గ్లాస్ అండ్ నియాన్ సైన్స్, షీట్‌మెటల్ వర్కర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్)
నాన్ ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు: బుక్‌బైండింగ్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కటింగ్ అండ్ స్యూయింగ్, డ్రెస్‌మేకింగ్, హార్టికల్చర్, లిథో- ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్, మాసన్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, ప్లంబర్, ప్రి ప్రిపరేటరీ స్కూల్ మేనేజ్‌మెంట్ (అసిస్టెంట్), స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్), వెల్డింగ్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్).
నాన్ఇంజినీరింగ్ 6 నెలల ట్రేడ్లు: డ్రైవర్ కమ్ మెకానిక్ (ఎల్ఎంవీ), హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్.
సీఓఈ ట్రేడ్లు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, ఆటోమొబైల్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, లెదర్, అపెరల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్, ఫ్యాబ్రికేషన్ (ఫిట్టింగ్, వెల్డింగ్), ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ మెషినరీ, కన్‌స్ట్రక్షన్ ఉడ్ వర్కింగ్, ప్రాసెస్ ప్లాంట్ మెయిన్‌టెనెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టూరిజం, బ్యాంబూ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎలాంటి రుసుమూ లేకుండా ప్రభుత్వం ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణనిస్తోంది. ప్రైవేటుగా (ఐటీసీల్లో అయితే) ఫీజులు వసూలు చేస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఉంటుంది.
ఐటీఐలకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. పదేళ్ల కిందట ఏటా 10 వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో చేరేవాళ్లు. ప్రస్తుతం ఏటా సుమారు లక్షమంది విద్యార్థులు చేరుతున్నారని అంచనా. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు కనీసం రూ.5000 నుంచి రూ.8000 వరకు నెలవారీ వేతనాలతో ఉపాధి పొందడానికి అవకాశాలు ఇప్పుడు బాగా ఉన్నాయి.

దరఖాస్తు చేయటం ఎలా

పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ ట్రేడ్‌లో చేరాలనుకుంటే సమీపంలోని ఐటీఐకి వెళ్లి ప్రిన్సిపాల్‌ను నేరుగా సంప్రదించవచ్చు.
* విద్యార్థులు తమ జిల్లాలోని ప్రిన్సిపాల్ లేదా కన్వీనర్ ద్వారా నేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
* జిల్లాలో ఉండే ప్రభుత్వ ఐటీఐ లేదా ఎన్‌సీవీటీ పరిధిలోని ఐటీసీ (ప్రైవేటు ఐటీసీ)ల్లో ప్రవేశానికి ఒకే దరఖాస్తు సరిపోతుంది.

రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ ఒక ఐటీఐ ప్రిన్సిపల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తును కన్వీనర్ కార్యాలయాల్లోనే అందించాలి.

కన్వీనర్ ల వివరాలు

1. శ్రీకాకుళం: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్) ఎచ్చెర్ల, శ్రీకాకుళం
2. విజయనగరం: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్), విజయ నగరం
3. విశాఖపట్నం: ప్రిన్సిపాల్, ఐటీఐ (ఓల్డ్) విశాఖపట్నం
4. తూర్పుగోదావరి: ప్రిన్సిపాల్, ఐటీఐ, కాకినాడ
5. పశ్చిమగోదావరి: ప్రిన్సిపాల్, ఐటీఐ, ఏలూరు
6. కృష్ణాజిల్లా: ప్రిన్సిపాల్, ఐటీఐ, విజయవాడ
7. గుంటూరు: ప్రిన్సిపాల్, ఐటీఐ, తెనాలి
8. ప్రకాశం: ప్రిన్సిపాల్, ఐటీఐ (బాయ్స్), ఒంగోలు
9. నెల్లూరు: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్), నెల్లూరు
10. అనంతపురం: ప్రిన్సిపాల్, ఐటీఐ (బాయ్స్), అనంతపురం
11. చిత్తూరు: ప్రిన్సిపాల్, ఐటీఐ, తిరుపతి
12. కడప: ప్రిన్సిపాల్, ఐటీఐ, కడప
13. కర్నూలు: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్), కర్నూలు
14. ఖమ్మం: ప్రిన్సిపాల్, ఐటీఐ, కొత్తగూడెం
15. కరీంనగర్: ప్రిన్సిపాల్, ఐటీఐ, పెద్దపల్లి
16. ఆదిలాబాద్: ప్రిన్సిపాల్, ఐటీఐ, మంచిర్యాల
17. నిజామాబాద్: ప్రిన్సిపాల్, ఐటీఐ (బాయ్స్) నిజామాబాద్
18. వరంగల్: ప్రిన్సిపాల్, ఐటీఐ (బాయ్స్), వరంగల్
19. నల్గొండ: ప్రిన్సిపాల్, ఐటీఐ, భువనగిరి
20. మహబూబ్‌నగర్: అసిస్టెంట్ డైరెక్టర్, డీఎల్‌టీసీ/ ఐటీఐ, మహబూబ్‌నగర్
21. మెదక్: ప్రిన్సిపాల్, ఐటీఐ, పటాన్‌చెరు
22. రంగారెడ్డి: ప్రిన్సిపాల్, ఐటీఐ, మేడ్చెల్
23. హైదరాబాద్: ప్రిన్సిపాల్, ఐటీఐ, సికింద్రాబాద్.

ఉద్యోగాలు

పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.

ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. స్థిరమైన జీవితం ఏర్పరుచుకోవడానికి చిన్న వయసులోనే తొలి అడుగులు వేయవచ్చు.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో ఏర్పడే క్లరికల్, ఆఫీసర్ తదితర హోదా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. టెన్త్, ఇంటర్, ఆపై అర్హతలకు తగినవిధంగా నియామక ప్రకటనలు జారీ చేస్తోంది. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వే మొదలైన విభాగాలు వివిధ రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, అటవీ శాఖలో ఏర్పడే ఖాళీలను ఆ శాఖ భర్తీ చేస్తోంది. వీటి గురించి తెలుసుకుందాం.

సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ – సీపీవో (భద్రతా విభాగాలు)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.
సీపీవో పరిధిలోని ప్రధాన విభాగాలు:
1. బీఎస్ఎఫ్ – బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
2. సీఐఎస్ఎఫ్ – సెంట్రల్ ఇండస్ట్రియల్‌సెక్యూరిటీ ఫోర్స్
3. సీఆర్‌పీఎఫ్ – సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
4. ఎస్ఎస్‌బీ – సశస్త్ర సీమబల్
5. ఐటీబీపీఎఫ్ – ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మూడు దశలుగా జరుగుతుంది.
మొదటి దశ: శారీరక సామర్థ్య పరీక్ష. దీన్లో పరుగు పందెం నిర్వహిస్తారు. తర్వాత లాంగ్‌జంప్, హైజంప్ ఉంటాయి.
రెండో దశ: ఇది రాత పరీక్షకు సంబంధించింది. మొదటి దశ పరీక్షల్లో అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు.
మూడో దశ: మొదటి రెండు దశల్లో జరిగిన పరీక్షల్లో విజయం సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు..

వెబ్‌సైట్: ssc.nic.in

త్రివిధ దళాలు

దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు…

ఇండియన్ ఆర్మీ:
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నిమిత్తం ప్రకటనలు జారీ చేస్తుంది. జిల్లా ప్రధాన కేంద్రాలు, పట్టణాల్లో వాక్-ఇన్/ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంది. ఆర్మీ పోస్టుల్లో ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉండేవి… సోల్జర్లు (జనరల్ డ్యూటీ).

అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 1/2 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) నిర్వహంచి ఎంపిక చేస్తారు. దీన్లో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1 సోల్జర్ జనరల్ కేటగిరీలకు చెందింది.
పేపర్-2 టెక్నికల్ సోల్జర్ విభాగాలకు చెందింది.
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.indianarmy.nic.in

ఎయిర్‌ఫోర్స్:
భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఎయిర్‌మన్ (మ్యుజీషియన్) ఉద్యోగాలను కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌లో ఇది గ్రూప్ – వై ట్రేడ్‌కు చెందింది.
అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

గిటార్, క్లారినెట్, వయోలిన్ లేదా ఇతర సంగీత వాయిద్య పరికరాల ప్రయోగం తెలిసి ఉండాలి. శారీరకప్రమాణాల్లో భాగంగా ఎత్తు 157 సెం.మీ., ఛాతీ సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మొదట రాత పరీక్ష తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు జరిపి ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.indianairforce.nic.in

ఇండియన్ నేవీ:
భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలను అందిస్తోంది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
1) కుక్స్: పదో తరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విధుల్లో భాగంగా ఆహార పదార్థాలను తయారుచేయగలగాలి.

2) స్టీవార్డ్స్: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. వెయిటర్లుగా, హౌస్‌కీపింగ్, విధుల నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి తగిన శిక్షణ ఇస్తారు.
వయసు: అన్ని రకాల పోస్టులకు అభ్యర్థుల వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: nausena-bharti.nic.in

3. ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్

ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తరచూ ప్రకటనలు జారీ చేస్తుంది. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ హోదాలోనే కుక్, వాషన్‌మన్, బార్బర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర హోదాలుంటాయి.
అర్హతలు: వీటికి కేవలం పురుషులు మాత్రమే అర్హులు.

పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షలు ఉంటాయి.
వెబ్‌సైట్: itbpolice.nic.in

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

రైల్వేలో రక్షణ విభాగానికి చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఈ ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ. పురుషులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు.

అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది. దీన్లో అర్హత సాధించిన వారికి తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌లు: www.indianrailways.gov.in & www.scrailway.gov.in

ఏపీపీఎస్సీ

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చేపడుతుంది. గ్రూప్ – IV స్థాయి ఉద్యోగాల నుంచి గ్రూప్ – I కేడర్ వరకూ నియామక ప్రక్రియను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. వీటిలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశమున్న ఉద్యోగాల గురించి తెలుసుకుందాం…
గ్రూప్- IV స్థాయిలో ఏపీ జువైనెల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సబ్ సర్వీసెస్‌లో సూపర్‌వైజర్లు, మ్యాట్రన్ పోస్టులు.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉండదు.

వెబ్‌సైట్‌లు: www.apspsc.gov.in

అటవీశాఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ జిల్లాల వారీగా కింది ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
1) అసిస్టెంట్ బీట్ అధికారులు
2) బంగ్లా వాచర్
3) ఠాగేదారు
ఈ మూడింటికి కనీస అర్హత పదో తరగతి.

వయసు: ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎత్తు: పురుషులు 163 సెం.మీ., స్త్రీలు 150 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: అర్హులైన వారికి మొదట శారీరక కొలతల పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధిస్తే రాత పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష విధానం: 1) వ్యాస రచన (జనరల్ ఎస్సే 20 మార్కులకు. సమయం: గంట)
2) జనరల్ నాలెడ్జ్ (100 మార్కులకు సమయం: గంటన్నర)
3) మ్యాథమేటిక్స్ (100 మార్కులకు సమయం: గంటన్నర) సబ్జెక్టులపై పరీక్ష.
రాత పరీక్షలో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపల పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయాలి. అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా ప్రకటనలు వస్తుంటాయి.

వెబ్‌సైట్‌లు: forest.ap.nic.in

ఆధారము: ఈనాడు

ఇతరములు:

  1. ఇండియన్ నావీలో నావికులు
  2. మెట్రిక్ రిక్రూట్స్ ( ఎం ఆర్ లు ) (mrs), మెట్రిక్ కాని రిక్రూట్స్ (ఎన్ ఎం ఆర్ లు) (nmrs) & మ్యుజిషియన్స్
  3. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ లో నావికులు
  4. టెక్నికల్ & నాన్ టెక్నికల్ ట్రేడ్ ఎయిర్ మెన్
  5. టెక్నికల్ కేడర్లు కానివారికి రైల్వేస్

పారామెడికల్ (3 సంవత్సరాలు)

  1. మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా (DMLT)
  2. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్ (DOT)
  3. డిప్లోమా ఇన్ అప్థాలమిక్ (కంటి ) అసిస్టెంట్ (DOA)
  4. డిప్లొమా హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ (DHFM)
  5. ఆరోగ్య ఇన్స్పెక్టర్
  6. వైద్య ఇన్స్పెక్టర్

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *